అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్‌

10-09-2026 | 06:41pm

ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీఆర్‌ఎస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ సరికాదు: మాజీ ఎంపీ నామ

వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం: మాజీ ఎంపీ నామ

ఖమ్మం,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసిన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌(KCR)పై కాంగ్రెస్‌ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను, బీఆర్‌ఎస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ను బీఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు(Former MP Nama Nageswara Rao) తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజాప్రతినిధి బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడి మరణాన్ని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు.

కేసీఆర్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాలు సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలకు, హింసను ప్రేరేపించే విధమైన వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తమ మాటల ద్వారా సమాజానికి బాధ్యతాయుతమైన సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుందని నామ పేర్కొన్నారు.

ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేతపై బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో ఆందోళన కలిగించడంతో పాటు శాంతిభద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నామ డిమాండ్ చేశారు. ఆ ప్రజా ప్రతినిధి చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరైనా ప్రేరేపించారా, సహకరించారా లేదా ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశాలను కూడా విచారించాలన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు, సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని, అయితే వ్యక్తిగతంగా దూషించడం, మరణాన్ని కోరుకోవడం వంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమని నామ స్పష్టం చేశారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి హాని కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నామ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ సరికాదు

ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులను ఈ సెషన్ ముగిసే వరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయడం సరికాదని నామ తెలియజేశారు. ప్రజలు ఎన్నుకుని శాసనసభకు పంపిన సభ్యులకు తమ నియోజకవర్గాల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను, ప్రజల ఇబ్బందులను ప్రస్తావించే విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో శాసనసభను నిర్వహించాలని కాని ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం లేకుండా సభ్యులను సస్పెండ్‌ చేయడం వల్ల ప్రజలకు సంబంధించిన సమస్యలపై సమగ్ర చర్చ జరగకుండా పోతుందని తెలిపారు.

వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలం: 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నామ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై విమర్శలు చేయడం, బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడం కాకుండా ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించాలని నామ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు