చెత్త ఎత్తిన కౌన్సిలర్ బాలకృష్ణ
మున్సిపల్ సిబ్బంది స్పందించకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పైకాజీ నగర్(Pikaji Nagar)లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పేరుకుపోయిన చెత్తను కౌన్సిలర్(Councillor) బాలకృష్ణ స్వయంగా తొలగించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాల గణేష్ మండలి వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది ఒకచోట చేర్చి వదిలేశారు. అయితే ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించకపోవడంతో సుమారు పది రోజులుగా అక్కడే చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించాలని మండలి నిర్వాహకులతో పాటు కౌన్సిలర్ బాలకృష్ణ పలుమార్లు మున్సిపల్ సిబ్బందిని కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. పారతో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ప్రజాప్రతినిధి స్వయంగా చెత్త తొలగించాల్సిన పరిస్థితి రావడంపై కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.