ముగిసిన బెజ్జూర్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టోర్నీ..
బెజ్జూర్ అక్టోబర్ 25 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ క్రీడా మైదానంలో గత కొన్ని రోజులుగా నిర్వహించిన తెలంగాణ అమరవీరుల స్మారక బెజ్జూర్ ప్రీమియర్ లీగ్(Bejjur Premier League) సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ టోర్నీలో 10 ఫ్రాంచైజీలు పాల్గొనగా ఫైనల్ లో సాయి 11, కుకూడా నైట్ రైడర్స్ తలపడ్డాయి.
ముందుగా బ్యాటింగ్ చేసిన కుకూడా నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సాయి 11 జట్టు 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. అనంతరం విజేతలకు స్థానిక సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, దీక్షిత్ ఫెర్టిలైజర్ ప్రొప్రైటర్ కవ్వాల సాయి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కవ్వాల సాయి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల పేరున క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఉద్యమ స్ఫూర్తితో పాటు క్రీడా స్ఫూర్తి కూడా యువతను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ జావిద్, అమిరుద్దీన్, పుల్లూరు సతీష్, దుర్గం వినోద్ కామెడీ సురేష్ క్రికెట్ క్రీడాల నిర్వాహకులు పురం వైకుంఠం, కాజా శంషుద్దీన్ (బాబు), రంగు సురేష్ గౌడ్, పొడిశం విజయ్ తదితరులు పాల్గొన్నారు.