పత్తి కాంటాల వద్ద ప్రైవేటు పెత్తనం!

27-11-2026 | 05:10am
  1. ప్రైవేటు కొనుగోళ్ల జోరు 
  2. తూకాలు, ధరలు, నిబంధనల అమలుపై రైతుల్లో సందేహాలు 
  3. అధికారుల పర్యవేక్షణ ఏదీ?

ఆసిఫాబాద్/వాంకిడి, నవంబర్ 26 (విజయక్రాంతి): పత్తి కొనుగోళ్ల సీజన్(Cotton buying season) ప్రారంభం కావడంతో  ప్రైవేటు పత్తి కాంటాల వద్ద సందడి నెలకొంది. మండలంలోని బంబారాఖమాన గ్రామాల మధ్య మార్గంలో కొనసాగుతున్న ప్రైవేటు పత్తి కొనుగోళ్ల నిర్వహణపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రైతుల శ్రమకు తగిన గిట్టుబాటు ధర లభించాల్సి ఉండగా, కొనుగోళ్ల ప్రక్రియలో నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పర్యవేక్షణ కరువు...!

రైతులు నెలల తరబడి కష్టపడి పండించిన పత్తిని విక్రయించే సమయంలో తూకం, ధర నిర్ణయం, చెల్లింపుల్లో పారదర్శకత ఉండటం అత్యంత ముఖ్యం. ప్రైవేటు కాంటాల వద్ద తూకాలు సక్రమంగా నిర్వహిస్తున్నారా? రైతులకు తూకం వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నారా? నాణ్యత పేరుతో కోతలు విధిస్తే వాటికి తగిన కారణాలు వివరిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

రహదారిపై రద్దీతో ఇబ్బందులు?

బంబారాఖమాన మార్గంలో పత్తి కొనుగోళ్లకు వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కాంటాల నిర్వాహకులపై ఉంది. పత్తి లోడింగ్, అన్లోడింగ్ సమయంలో వాహనాల నిలుపుదలతో ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.

అధికారులు స్పందించేనా?

ప్రైవేటు పత్తి కాంటాల నిర్వహణపై వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలుకొలతల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. కాంటాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు, తూకం యంత్రాల ధ్రువీకరణ, కొనుగోలు నిబంధనలు, రైతులకు అందుతున్న ధరలు, చెల్లింపుల విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి రైతుల ప్రయోజనాలను కాపాడుతారా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు