నిమజ్జన ప్రదేశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ కె. హరిత
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha) ఆదేశించారు. బుధవారం కాగజ్‌నగర్ మండల కేంద్రంలోని పెద్దవాగు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ప్రదేశాన్ని సబ్‌కలెక్టర్ హర్మ చౌదరి, డీఎస్పీ వహీదుద్దీన్లతో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన చోట రహదారి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతంలోని మట్టిని చదును చేసి, విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా అదనపు క్రేన్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.నిమజ్జన ప్రదేశంలో తగినంత సిబ్బందిని నియమించాలని, రహదారులు, నిమజ్జన ప్రాంతాల్లో సమృద్ధిగా వెలుతురు ఉండేలా చూడాలని సూచించారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.