కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా: పువ్వాడ
శ్రీనివాస్ నగర్ బాధితులకు మాజీ మంత్రి పువ్వాడ మద్దతు
ఖమ్మం, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) విమర్శించారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులకు ఆయన మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చివేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని పువ్వాడ ఆందోళన వ్యక్తం చేశారు. వికాసం, అభివృద్ధి చేపట్టడం చేతకాని ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు.
పేదల ఇళ్లను కూల్చివేసి వారి జీవనోపాధిపై ప్రభావం చూపడం సరికాదని, పేదల పొట్ట కొట్టే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ల కూల్చివేత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం నగరంలో అనేక మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, పేదలకు గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమైతే, ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మిగిలిన ఘనతగా మారిందని ఆయన విమర్శించారు.