ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప
రు. 22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిపిఓ
కాగజ్ నగర్,(విజయక్రాంతి): భూమి విరాసత్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడిన గ్రామపంచాయతీ అధికారి. వివరాల్లోకి వెళ్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad district) కాగజ్ నగర్ మండలంలోని మోసం గ్రామపంచాయతీ పరిధిలోగల ఆరెగూడ గ్రామానికి చెందిన రైతులు చౌదరి మోహన్ రావు, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు భూమి విరసత్ కోసం స్థానిక గ్రామపంచాయతీ అధికారిని ఆశ్రయించారు.
చనిపోయిన తమ తండ్రి చౌదరి పెంటయ్య పేరు మీద గల 18 ఎకరాల భూమిని విరసత్ చేయాలని జిపిఓ శ్రీనివాసు(GPO Srinivas)ను వారు కోరారు. దీనికి ప్రతిఫలంగా జిపిఓ శ్రీనివాస్ ఆ రైతుల నుండి రు.50 వేలు డిమాండ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. దీంతో రైతులు జిపిఓ కి రు.22 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు . రైతులు మోహన్ రావు, సంతోష్‌లు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకేముంది అనుకున్న విధంగా ప్లాన్ చేశారు.
గురువారం కాగజ్‌నగర్ తాహసిల్దార్ కార్యాలయంలో జిపిఓకి రు.22 వేలు లంచం ఇస్తుండగా ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్ పిబి మధు సిబ్బందితో కలిసి జిపిఓ శ్రీనివాసును రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏసిబి డిఎస్పి మాట్లాడుతూ రైతులు తమను ఆశ్రయించడంతో జిపిఓను వలవేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్ని ఎవరైనా అధికారులు లంచాల పేరిట వేధిస్తే తమను ఆశ్రయించాలని డి.ఎస్.పి మధు కోరారు. అంతకు ముందు సుమారు 3 గంటలపాటు తహసిల్దార్ మధుకర్, ఇతర సిబ్బందిని విచారించారు. అనంతరం జిపిఓ శ్రీనివాసును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.