పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

29-10-2026 | 09:44pm

గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల(Tribal Welfare Boys' Home School), ఆదర్శ క్రీడా పాఠశాల బాలికల పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, పదో తరగతి పరీక్షల సన్నద్ధతను పరిశీలించారు.

దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని, సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలన్నారు.

ఇటీవల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆదర్శ క్రీడా పాఠశాల బాలికలతో ఆయన ముచ్చటించి, వారి విజయాలను అభినందించారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించేలా క్రమశిక్షణతో సాధన చేయాలని సూచించారు. విద్యార్థినుల్లోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు, జీసీడీవో కొట్నాక్ శకుంతల, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, లింబారావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు