జిల్లాలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి..

27-10-2026 | 04:55pm

న్యాయవాది, సామాజిక కార్యకర్త జావిద్ అలీ ఖాన్

బెజ్జూర్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): జిల్లాలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాది, సామాజిక కార్యకర్త జావిద్ అలీ ఖాన్(Javid Ali Khan) ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 

జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇంకా ఎన్నాళ్లు కరీంనగర్, మంచిర్యాల హైదరాబాద్, మహారాష్ట్రలోని చంద్రపూర్ వర్ధ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలు ప్రయాణ ఖర్చులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

కాగజ్‌నగర్‌లో కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు), నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండాల వైద్య నిపుణుడు), పీడియాట్రిషియన్ (పిల్లల వైద్య నిపుణుడు)ను నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, MRI, CT స్కాన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కాగజ్‌నగర్‌లో అత్యవసరంగా ఆధునిక వైద్య పరీక్షల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తే బెజ్జూర్, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట్, సిర్పూర్ మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జావిద్ అలీ ఖాన్ అన్నారు.

ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, చిన్నపిల్లల అనారోగ్య పరిస్థితుల్లో స్థానికంగానే వైద్యం అందుబాటులో ఉంటే, అత్యవసర సమయాల్లో చికిత్సలో ఆలస్యం తగ్గి ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ సమస్యపై అధికారులు, అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు పార్టీలకు అతీతంగా స్పందించాలని జావిద్ అలీ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, జిల్లా ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్య అని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమిష్టిగా కృషి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని జావిద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు