కేజీబీవీలో మౌలిక వసతులు

27-10-2026 | 05:20pm

భైంసా, (విజయక్రాంతి): విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, నిత్యజీవిత అనుభవాలతో అనుసంధానం చేసుకొని నేర్చుకునేలా ఆచరణాత్మక బోధన అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) సూచించారు. మంగళవారం కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వసతి గృహం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు వసతి గృహంలోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.4.80 లక్షలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీ నిర్మాణంతో పాటు అవసరమైన ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోతుల బెడద నివారణకు సోలార్ కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థుల అవసరాన్ని బట్టి ప్రాధాన్యత క్రమంలో బెంచీలు సమకూరుస్తామని పేర్కొన్నారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. వారి చదువు, విద్యా ప్రగతిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జీవశాస్త్రంలోని ఒక అంశాన్ని స్వయంగా బోధించి, విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి అవగాహనను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీఓ శోభన, ఎంఈఓ ముత్యం, సర్పంచ్ దశరథ్, సర్వే అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు