రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎస్పీ నితికా పంత్‌తో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని, రహదారులపై గుంతలను పూడ్చాలని సూచించారు.
వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో నెలరోజుల వ్యవధిలో రహదారి ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.