మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
రాజీతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం
ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) తెలిపారు. ఈ నెల 12న శనివారం నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను(National Mega Lok Adalat) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. “రాజీయే రాజమార్గం” అనే భావనతో పరస్పర అంగీకారంతో వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన వివాదాలు, కుటుంబ, వైవాహిక సమస్యలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
చిన్నచిన్న వివాదాలను పెద్ద కక్షలుగా మార్చుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోవద్దని సూచించారు.రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే సిబ్బంది సంబంధిత ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పిస్తారని ఎస్పీ తెలిపారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకుని స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలకు ముగింపు పలకాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.