కాంగ్రెస్‌పై అమిత్ షా డైరెక్ట్ ఎటాక్!
హైదరాబాద్: వరుస ఎన్నికల ఓటములతో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రావడం సాధ్యం కాకపోవడంతో అరాచక మార్గాలను ఎంచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రపూరిత ప్రయత్నాల నుంచి దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'లోక్తంత్ర బచావో – అరాచకత హటావో' (Save Democracy) మహా పాదయాత్రలో పాల్గొంటున్నట్లు అమిత్ షా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మహా పాదయాత్రలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
పాదయాత్ర ముగిసిన అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన అమిత్ షా.. హైదరాబాద్ వేదికగా ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అమిత్ షా పర్యటన, ఆయన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి.