రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,నవంబర్ 2 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యానికి రైతులకు మద్దతు ధర అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy ) అన్నారు. మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన డిసిసిబి మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మునుగోడు మండలంలో వరి సాగు విస్తీర్ణం, అంచనా దిగుబడి, ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడిపై పడిన ప్రభావం తదితర వివరాలను అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎంత? ప్రైవేటు వ్యాపారులు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం స్వయంగా తేమ శాతం పరీక్షించే యంత్రంలో ధాన్యాన్ని పరిశీలించి, కాటాపై ధాన్యం బస్తాను ఉంచి తూకం వేయడం ద్వారా కొనుగోళ్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటినారాయణ, ఆర్డీవో శ్రీదేవి, తాసిల్దార్ నేలపట్ల నరేష్, ఎంపీడీవో, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జీవనపల్లి సైదులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నార బోయినరవి ముదిరాజ్,జాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు ఉన్నారు.