రైతులను బోనులో నిలబెట్టారు
హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను(Farmers) పంటలు వేయొద్దని సూచించే పరిస్థితి రావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గతంలో 1999 నుంచి 2004 మధ్య తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులను పంటలు(Crops) వేయొద్దని ఎవరూ చెప్పలేదని ఈటల గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక్క కరువుకే ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. రైతులకు కనీసం నాణ్యమైన విద్యుత్ కూడా అందడం లేదని, ఇప్పటికైనా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ఉన్నా నీళ్లెందుకు ఇవ్వలేదు?
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కరువు ముప్పు ఉండదని గతంలోనే చెప్పానని ఈటల పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ ప్రాణహిత నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించలేదని ఆరోపించారు.
కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రాజెక్టులపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించి రైతులకు నీరందించాలని సూచించారు.
రేవంత్ భ్రమల్లో ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపైనా ఈటల విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయనే భ్రమల్లో ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరో 15 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
వానాకాలం పంటల కొనుగోలు, రైతులకు బోనస్, మొక్కజొన్న కొనుగోళ్లలోనూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ఈటల ఆరోపించారు. రైతులు తమ పంటలను తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.