ఘనంగా గాంధీజీ విగ్రహావిష్కరణ
సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మంత్రులు
కల్వకుర్తి అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు(Ministers Jupally Krishna Rao), రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ హాజరై మంత్రులతో కలిసి గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగించిన పోరాటాన్ని, ఆయన పాటించిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ సిద్ధాంతాలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని మంత్రులు పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పాలమూరు కూడలిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మెన్ షాన్వాజ్ , మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ , ప్రజా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.