మహిళా డిగ్రీ గురుకులాన్ని తక్షణమే మార్చాలి
మహబూబాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని(Female student) ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌తో పాటు ఆర్సీవోలను సస్పెండ్(Suspend) చేయాలని, మహిళా డిగ్రీ గురుకులాన్ని తక్షణమే మార్చాలని, సొంత భవనం ఏర్పాటు చేయాలని డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ డిమాండ్ చేశారు.
శుక్రవారం మహబూబాబాద్ మహిళా డిగ్రీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి, కళాశాలలో నెలకొన్న సమస్యలు, వసతులు, విద్యార్థినుల భద్రత, యాజమాన్య పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ, విద్యార్థినులకు కనీస భద్రత కల్పించలేని పరిస్థితుల్లో మహిళా డిగ్రీ గురుకులం కొనసాగడం దారుణమని విమర్శించారు.
హాస్టల్లోనే విద్యార్థిని ప్రసవించే పరిస్థితి రావడం అధికారుల పర్యవేక్షణ లోపానికి, యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా డిగ్రీ గురుకులాన్ని ప్రస్తుత ప్రదేశం నుంచి తక్షణమే మరో అనువైన ప్రదేశానికి మార్చాలని, విద్యార్థినులకు అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సొంత భవనాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపాల్‌తో పాటు సంబంధిత ఆర్సీవోలను తక్షణమే సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.