మరిపెడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ స్వేత

23-10-2026 | 09:50pm

మహబూబాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్(Maripeda Police Station, Mahabubabad District) ను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ డిఐజి స్వేత(DIG of Bhadradri Zone, Swetha) తనిఖీ చేశారు. డీ ఐ జీ కి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పుష్పగుచ్ఛం అందించి  స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీతో కలిసి డీ ఐ జీ పోలీస్ స్టేషన్‌లోని కిట్ ఆర్టికల్స్, యూనిఫాంలు, షూస్, లాఠీలు తదితర పోలీసు సామగ్రిని పరిశీలించారు.

స్టేషన్ పరిసరాలు, వివిధ గదులు, ఫైళ్ల నిర్వహణ, రికార్డు షెల్ఫ్‌ల అమరికను తనిఖీ చేశారు. పరిశుభ్రత, క్రమబద్ధత, సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించిన 5 ఎస్ విధానం అమలు తీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న క్రైమ్ రికార్డులు, అనుమానిత వ్యక్తుల షీట్లు, డ్రగ్స్ డిస్పోజల్ రికార్డులు, ప్రాపర్టీ రిజిస్టర్, గన్ లైసెన్స్ రిజిస్టర్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, పెట్టీ కేసుల రిజిస్టర్, ప్రాసెస్ రిజిస్టర్ తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రతి రికార్డును నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ సిబ్బందితో సీపీ ముఖాముఖిగా మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, సమస్యలు, సంక్షేమ అంశాలపై ఆరా తీశారు. విధుల్లో నిరంతరం బిజీగా ఉండే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు