వరద ముంపునకు శాశ్వత పరిష్కారం

03-10-2026 | 04:40pm

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): మహబూబ్‌నగర్(Mahabubnagar) నగరంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. 24వ డివిజన్‌లో యూఐడీఎఫ్ నిధులతో రూ.95 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.71 లక్షలతో నిర్మించనున్న నూతన వర్షపు నీటి కాలువలకు శంకుస్థాపన చేయగా, రూ.24 లక్షలతో ఇప్పటికే పూర్తయిన వర్షపు నీటి కాలువ(Rainwater drain)ను ప్రారంభించారు. అలాగే 25వ డివిజన్‌లో రూ.8 లక్షల యూఐడీఎఫ్ నిధులతో నిర్మించనున్న వర్షపు నీటి కాలువకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా, కాలనీల్లోకి వరద నీరు చేరకుండా పక్కా ప్రణాళికతో కాలువల వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లో శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్(Mayor Gummala Mamata Srinivas), ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, కార్పొరేటర్లు గుముడాల రాధ గోవర్ధన్ గౌడ్, పాండురంగారెడ్డి, తాహేర్, ఫకృ ఖురేషి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు