23 ఏళ్ల డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం

27-11-2026 | 03:11pm
  1. 7.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపునకు శ్రీకారం..
  2. రెండేళ్లలోపు నుంచి మూడేళ్లలోగా పూర్తి లక్ష్యం: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్  (విజయక్రాంతి): వీరన్నపేట డంపింగ్ యార్డులో(Veerannapeta Dumping Yard) పేరుకుపోయిన 7.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి, ప్రజలకు దుర్గంధం, కాలుష్యం, విషవాయువుల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. డంపింగ్ యార్డులో పాత వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు చెత్తను పూర్తిస్థాయిలో తొలగించడమే లక్ష్యమని తెలిపారు. చెత్తను శాస్త్రీయంగా విభజించి, ప్లాస్టిక్‌ను వేరు చేయడం, సేంద్రియ వ్యర్థాలతో ఎరువుల తయారీ, పునర్వినియోగానికి అనువైన వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నగరంలో రోజుకు 100 నుంచి 110 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని, భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా శాశ్వత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, కార్పొరేటర్లు ఫకృ, మోసిన్, యాదగిరి, రమేష్, అనుప ఆంజనేయులు, ఫయాజ్, రఘు, కె.సత్యం, ప్రశాంత్, రమేష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు