దేవుడు ఇచ్చే విశ్రాంతిని పొందుకోండి

17-10-2026 | 06:52pm

అంతర్జాతీయ ముఖ్య ప్రసంగికులు ప్రశాంత్ జోషి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : దేవుని సన్నిధిలోనే మనిషికి నిజమైన ప్రశాంతత, ఆత్మీయ బలం లభిస్తాయని ఆయన ఇచ్చే విశ్రాంతిని ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సిందిగా అంతర్జాతీయ ముఖ్య ప్రసంగీకులు పాస్టర్ ప్రశాంత్ జోషి(Pastor Prashanth Joshi) పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో రెమా వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో డైరెక్టర్ పాస్టర్ బిఎస్ పరంజ్యోతి(Pastor B.S. Paramjyothi) అధ్యక్షతన నిర్వహించిన మూడు రోజుల ఉపవాస ప్రార్థన పండుగ(Festival of Fasting and Prayer) ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య ప్రసంగికులుగా హాజరై ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ జోషి మాట్లాడుతూ.. దేవుడు ఈ సృష్టిని ఆరు రోజులపాటు సృష్టించి, ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడని బైబిల్ బోధిస్తోందని వివరించారు. సృష్టికర్త అయిన దేవుడే విశ్రాంతికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనిషి కూడా తన జీవితంలో దేవుని సన్నిధికి సమయం కేటాయించాలని సూచించారు. నేటి సమాజంలో మనుషులు అనేక సమస్యలు, ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం ద్వారా మనశ్శాంతిని పొందుకోవచ్చన్నారు.

దేవుడు తనను ఆశ్రయించే వారికి విశ్రాంతిని, నూతన ఉత్సాహాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాడన్నా విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఇక జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రార్థన ద్వారా దేవునితో సంబంధాన్ని బలపరచుకోవాలని, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉపవాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని ఈ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మూడు రోజులపాటు ఉపవాస ప్రార్థన పండుగల్ని నిర్వహించిన నిర్వాహకులు పరంజ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు.

వర్షం కోసం ప్రత్యేక ప్రార్థన: ప్రస్తుతం నెలకొన్న వర్షభావ పరిస్థితుల్ని అధిగమించి దేవుడు సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు తిమోతి, వేదాంతి,సుందర్ పాల్, నాగరాజు, సంఘ పెద్దలు రమేష్, బహుదూర్, వడ్డేమాన్ రాజు, బలరాం, లక్ష్మన్న, మహేందర్, దేవయ్య, సిస్టర్స్ ఎస్తేర్, రాణి, మన్నెమ్మ, మార్తా, మహేశ్వరి, బ్లాండిన, అధిక సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు