నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
DMHO డా. శ్రీనివాసులు
జడ్చర్ల, అక్టోబర్ 17: జడ్చర్ల పట్టణంలో గౌరీ శంకర్ కాలనీలో నమోదైన డెంగ్యూ కేసు(Dengue case) నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా. శ్రీనివాసులు కాలనీని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డెంగ్యూ కేసుకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డా. శ్రీనివాసులు(Dr. Srinivasulu) మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వృద్ధికి అవకాశం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సాయంత్రం వేళల్లో తలుపులు, కిటికీలు మూసి దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమతెరలను వినియోగించాలని సూచించారు.
అలాగే ఫీల్డ్ సిబ్బంది ప్రతిరోజూ ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రెండు, మూడు రోజులకంటే ఎక్కువగా జ్వరం ఉన్న వారిని గుర్తించి UPHCలో వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో DEMO టీమ్, DMO టీమ్, UPHC మెడికల్ టీమ్ సభ్యులు పాల్గొని డెంగ్యూ నివారణ చర్యలను పరిశీలించారు. ప్రజలు కూడా వైద్య సిబ్బందికి సహకరిస్తూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.