రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి

23-11-2026 | 10:01pm
  1. - 15 రోజులకు ఒకసారి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించాలి
  2. - 50 కిలోమీటర్లకు ఒక హైవే పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేయాలి
  3. - ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
  4. - కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో డి.సి.పి. ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి రహదారులపై ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, వాహనాల తనిఖీలు, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై వాహనాలు నిలిపే విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని, వాహనాలు బ్రేక్‌డౌన్ అయినా, డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలన్నా జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ నిలపకుండా నిర్దేశించిన ట్రక్ లే-బే ప్రాంతాలలో మాత్రమే నిలపాలని సూచించారు. ఈ విషయంలో జాతీయ రహదారుల అధికారులు, ఆర్ & బి అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

15 రోజులకు ఒకసారి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించాలి...

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా రహదారి భద్రతా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ కమిటీలో ఆర్డీవో, ఎ.సి.పి., డి.టి.ఓ. ద్వారా నామినేట్ చేయబడిన ఎంవిఐ, ఆర్ & బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎన్‌హెచ్‌ఎఐ డిప్యూటీ మేనేజర్, సంబంధిత రహదారుల అధికారులు, హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి, ఎన్‌హెచ్-363, ఎన్‌హెచ్-63, ఎస్‌హెచ్-24 ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించాలన్నారు.

జాతీయ రహదారి-63ను ఉత్తర గోదావరి ప్రాంతం వైపు విస్తరించడంతో పాటు రాబోయే పుష్కరాల సమయంలో పెరిగే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందారం వంతెన నుంచి గోదావరి వంతెన వరకు వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతంలో లైటింగ్ సదుపాయాల లేమి కారణంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగితే సంబంధిత హెచ్‌కెఆర్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు.

కలెక్టరేట్ సముదాయం సమీపంలోని జాతీయ రహదారి-63పై వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, శ్రీరాంపూర్ సింగరేణి జి.ఎం. కార్యాలయం వద్ద వీధి దీపాలు, రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి, ఎన్‌హెచ్-363, ఎన్‌హెచ్-63, ఎస్‌హెచ్-24 లపై భారీ, వాణిజ్య వాహనాలు క్యారేజ్‌వే / పేవ్డ్ షోల్డర్లపై నిలిపి పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ అలర్టులు, జి.పి.ఎస్. టైమ్‌స్టాంప్ ఫొటోగ్రాఫిక్ ఆధారాలతో పర్యవేక్షించాలని తెలిపారు. 

50 కిలోమీటర్లకు ఒక హైవే పెట్రోలింగ్ వాహనం

జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హైవే పెట్రోలింగ్ వాహనాన్ని 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఆ వాహనానికి స్పీడ్ గన్స్, నిఘా కెమెరాలు, పోలీసు శాఖతో అనుసంధానమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసు, ఆర్.డి.ఓ., రహదారుల శాఖల సమన్వయంతో కెమెరాలు, ట్రాకింగ్ పరికరాలు, స్పీడ్ గన్స్ కలిగిన పెట్రోలింగ్ వాహనాలను 30 రోజులలోగా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి, ఎన్‌హెచ్-363, ఎన్‌హెచ్-63, ఎస్‌హెచ్-24 లపై అక్రమ ఆక్రమణలు, కొత్తగా నిర్మించిన / నిర్వహిస్తున్న దాబాలు, తినుబండారాల కేంద్రాలను గుర్తించి వెంటనే తొలగించాలని తెలిపారు. జాతీయ రహదారులపై బిఎల్ఎస్ అంబులెన్సులు, రికవరీ క్రేన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 75 కిలోమీటర్లకు ఒక ట్రక్ లే-బే ఏర్పాటు చేయాలని, ఇందులో విశ్రాంతి గదులు, ఆహార సదుపాయాలు, సురక్షిత పార్కింగ్, ప్రథమ చికిత్స సదుపాయాలు, 500 మీటర్ల దూరం నుంచే కనిపించే రిఫ్లెక్టివ్ రహదారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లు, కీలక ప్రాంతాలను గుర్తించి హై ఇంటెన్సిటీ ఎల్ఈడి, హైమాస్ లైటింగ్, స్పీడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు, రిఫ్లెక్టివ్ సూచిక బోర్డులు, ట్రాన్స్‌వర్స్ బార్ మార్కింగులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాలసీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 4 నెలలలోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైవే సేఫ్టీ జోన్ల పరిధిలో ఎలాంటి కొత్త లైసెన్సులు, ఎన్‌ఓసిలు, ట్రేడ్ అనుమతులు మంజూరు చేయడం / పునరుద్ధరించడం చేయకూడదని, ఇప్పటికే మంజూరైన లైసెన్సులను 30 రోజులలోగా సమీక్షించాలని అధికారులకు సూచించారు.

రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువుల వల్ల ప్రమాదాలు జరగకుండా మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వీధి పశువులను తరలించేందుకు నిపుణులైన యానిమల్ క్యాచర్లను నియమించేందుకు అవసరమైన అంచనాలను సమర్పించాలని తెలిపారు. పాఠశాల బస్సుల డ్రైవర్లకు సెలవు అనంతరం మరుసటి రోజు, ముఖ్యంగా సోమవారాలలో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని, అన్ని పాఠశాల బస్సులకు డి.టి.ఓ. ద్వారా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

- బెల్లంపల్లి కాల్ టెక్స్, కన్నాల ఫ్లైఓవర్ల వద్ద వేగంగా దిగి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మార్కింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మధుర జంక్షన్ వద్ద ప్రస్తుతం ఉన్న టీ జంక్షన్ స్థానంలో వై జంక్షన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

- శ్రీరాంపూర్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూచన మేరకు ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-363 ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ వద్ద అకస్మాత్తుగా వచ్చే మలుపుల గురించి వాహనదారులకు ముందస్తుగా తెలిసేలా తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

- లక్షెట్టిపేట బస్టాండ్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని, చింతపల్లి వద్ద బతుకమ్మవాగు ప్రాంతంలో రహదారికి ఇరువైపులా సరైన షోల్డర్లు నిర్మించాలని సూచించారు. 

- మంచిర్యాల పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ అధికారులు స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్లతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. మంచిర్యాల పట్టణ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. 

- జైపూర్ మండల పరిధిలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి డ్రైవర్ల వద్ద చెల్లుబాటు అయ్యే బీమా, వాహన పత్రాలను పరిశీలించాలని తెలిపారు.

అధిక బరువుతో వెళ్లే వాహనాలకు జరిమానాలు విధించాలి

అధిక బరువుతో వాహనాలు నడిపే వారిపై జరిమానాలు విధించాలని, లైసెన్సుల సస్పెన్షన్, రద్దుకు సంబంధించిన కేసులను డి.టి.ఓ. ద్వారా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఈ చర్యల వివరాలను డీపీఆర్ఓకి పంపించి పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకొని, పట్టుబడిన వారి వివరాలు, లైసెన్స్ రద్దు చర్యల కోసం డి.టి.ఓ.కు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు డి.పి.ఆర్.ఓ.కు పంపించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించి జరిమానాలు విధించాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. భవన యజమానులు తమ భవనాలలోని సెల్లార్లను అద్దెకు ఇవ్వకూడదని, సెల్లార్లను కేవలం వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని సూచించారు.

జాతీయ రహదారులకు వెళ్లే అప్రోచ్ రోడ్లపై అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్ & బి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అమలు నివేదికలు సమర్పించాలని, ప్రజలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సభ్య కార్యదర్శి, ఆర్ & బి, జాతీయ రహదారుల శాఖ, పోలీసు, ట్రాఫిక్, రవాణా, రెవెన్యూ, మున్సిపల్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖల అధికారులు, వైద్యాధికారులు డాక్టర్ సునీల్, డెమో బుక్కా వెంకటేశ్వర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు