శిథిలం... వైకుంఠధామాలు....
- రూ.12 లక్షలతో నిర్మాణాలు...
- పర్యవేక్షణ కరువు...
- ఏడు సంవత్సరాలకే శిథిలం..
తాడ్వాయి,నవంబర్, 23( విజయ క్రాంతి ): ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు(Vaikuntha Dhams) ప్రత్యేకంగా ఉండాలనే సంకల్పంతో అప్పటి ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠ దామాల నిర్మాణాలు చేపట్టింది.గ్రామంలో మృత్యువాత పడ్డవారికి సరైన స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా స్మశాన వాటికల స్థలాలలో వైకుంఠధామాలను నిర్మించింది.ఒక్కో వైకుంఠధామాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నిర్మించాలని భావించింది.
అందులో సర్పంచులు, పంచాయతీ పాలకవర్గాన్ని భాగస్వాములు చేసింది.కానీ సదరు కాంట్రాక్టర్లు నాణ్యతతో వైకుంఠధామాలను నిర్మించకపోవడంతో ప్రస్తుతం వైకుంఠధామాలలో నిర్మించిన భాగాలు ఒక్కొక్కటిగా శిథిలమవుతున్నాయి.
ఒక్కో వైకుంఠధామానికి రూ.12 లక్షలు ఖర్చు...
ప్రభుత్వం జిల్లాలోని గ్రామాలలో నిర్మించిన వైకుంఠధామాలకు ఒక్కో వైకుంఠధామానికి ప్రభుత్వం రూ.12 లక్షల నిధులు కేటాయించింది.ఈ నిధులతో వైకుంఠధామాలను పూర్తి చేయాలని భావించింది.కానీ వైకుంఠధామాలు ఏర్పాటు చేసిన గదులు,కాల్చడానికి నిర్మించిన స్లాబులు నాణ్యతతో నిర్మించలేదనే విమర్శలు ఉన్నాయి.
శిథిలమవుతున్న మరుగుదొడ్లు..
వైకుంఠధామాలకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠధామాల ఆవరణలో పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మరుగుదొడ్లను నిర్మించింది.వాటికి ప్రత్యేకంగా సింకులను,నల్లాలను ఏర్పాటు చేసింది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే భావంతో ప్రతి మరుగుదొడ్డికి దర్వాజాలను ఏర్పాటు చేసింది. కానీ అవి నాణ్యతగా లేకపోవడంతో దర్వాజాలు విరిగిపోతున్నాయి. సింకులు పగిలి పోతున్నాయి.
వైకుంఠధామాలను పర్యవేక్షించాలి...
జిల్లాలోని ప్రతి గ్రామంలో,ప్రతి తండా గ్రామపంచాయతీలో సైతం ప్రభుత్వం వైకుంఠధామాలను ప్రత్యేకంగా నిర్మించింది.ప్రస్తుతం ఆ వైకుంఠధామాలకు పర్యవేక్షణ కరువైంది. దీంతో ఎంతో సంకల్పంతో నిర్మించిన వైకుంఠధామాలు శీతిల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లోని ప్రతి వైకుంఠధామాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించి పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏడు సంవత్సరాలకే శిథిలం...
ప్రభుత్వం వైకుంఠధామాలను నిర్మించిన ఏడు సంవత్సరాలకే శీతులమవుతున్నాయి.ఏవైనా భవన నిర్మాణాలు కానీ డ్రైనేజీలు సిసి రోడ్లు అయినా నిర్మించిన 20 సంవత్సరాలైనా మన్నికగా ఉండాలి కానీ సదరు కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల ఆమ్యామ్యాల కారణంగా అనతి కాలంలోనే వైకుంఠధామాలు శితిలమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలమైన వైకుంఠధామాలకు మరమ్మతులు నిర్వహించాలని కోరుతున్నారు.