వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
లక్షేట్టిపేట,అక్టోబర్ 17( విజయక్రాంతి ) : ప్రభుత్వ ఆసుపత్రులలో(Government Hospital) ప్రజలకు అందించే వైద్య సేవల్లో(Medical Services) నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు(Medical Services), రోగుల సంఖ్య, వ్యాధుల వివరాలు, మందుల లభ్యత, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించి ఆసుపత్రికి ప్రతిరోజూ వస్తున్న రోగులు, నమోదు అవుతున్న వ్యాధులు, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు డెంగ్యూ లక్షణాలతో వస్తున్న రోగుల వివరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అవసరమైన మందులు సరిపడా అందుబాటులో ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిలోని ల్యాబ్ను సందర్శించి పరీక్షల నిర్వహణ, రోగుల వివరాల నమోదు, రిజిస్టర్ల నిర్వహణ అంశాలను పరిశీలించి, ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలని, వ్యాధులపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహార నాణ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. డెంగ్యూ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్న రోగులు ఏ ప్రాంతాలకు చెందినవారో గుర్తించి, ఆయా ప్రాంతాలలో త్రాగునీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు వ్యాధుల వ్యాప్తికి దారితీసే పరిస్థితులను గుర్తించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో త్రాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో వెంటనే నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీటి నాణ్యతను నిర్ధారించేందుకు 10వ వార్డుతో పాటు పట్టణంలోని అన్ని వార్డులలోనూ నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. డెంగ్యూ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, వివరాలను సమగ్రంగా పరిశీలించాలని వైద్యులకు సూచించారు. మున్సిపల్ అధికారులు అన్ని వార్డులలో త్రాగునీటి పరీక్షలు నిర్వహించడంతో పాటు మురుగు కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను నివారిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలను నిరంతరం చేపట్టాలని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడం, అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడం, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.