నిమర్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి,(విజయక్రాంతి): వినాయక నవరాత్రుల(Vinayaka Navaratri) అనంతరం నిర్వహించే నిమర్జన కార్యక్రమాన్ని సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుపుకోవాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టామని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar deepak) తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని ఎంపీడీఓ ప్రసాద్, ఎస్ఐలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినాయక నిమజ్జన(Ganesh immersion) కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. అనంతరం మండలంలోని ద్వారకలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతి గృహం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, విద్యా బోధన, పరిసరాలను పరిశీలించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎం పీ డీ ఓ ప్రసాద్ లతో కలిసి సందర్శించి భోజనశాల, అదనపు గదులు, వంటశాల, సామాగ్రి నిల్వ గది, వసతి సదుపాయాలను పరిశీలించారు.
అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి కల్పిస్తున్న సదుపాయాల వివరాలను తెలుసుకున్నారు. గర్భిణులు సమయానుసారంగా అవసరమైన పరీక్షలు చేసుకొని సకాలంలో పౌష్టిక ఆహారం, మందులు తీసుకోవాలని, ప్రసవం ఆసుపత్రిలోని చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.