నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

23-09-2026 | 04:05pm

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

గోదావరి బ్రిడ్జి నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన సీపీ, కలెక్టర్

గోదావరిఖని,(విజయక్రాంతి): గణపతి నిమజ్జనోత్సవాన్ని(Ganpati immersion) ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) తెలిపారు. బుధవారం గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్‌ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha)తో కలిసి సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర మార్గం, నిమజ్జన ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పోలీసులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మున్సిపల్, సింగరేణి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు, నిబంధనలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను మత సామరస్యానికి ప్రతీకగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ(Additional Collector Arunashree), గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సింగరేణి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు