ఇందిరమ్మ భీమాతో కుటుంబానికి ధీమా
సర్పంచ్ దుమ్మని సత్తన్న
లక్షేట్టిపేట, నవంబర్ 23(విజయక్రాంతి): ఇందిరమ్మ భీమాతో(Indiramma Insurance) కుటుంబానికి ధీమా అని మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ దుమ్మని సత్తన్న అన్నారు. సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ భవనంలో పలు కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా కేవలం రైతులకే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు జీవిత భీమా అందేలా పటిష్ట పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు.
ఇందిరమ్మ జీవిత భీమాతో గ్రామంలోని 527 మందికి మేలు జరుగుతుందన్నారు. గీత కార్మికులు, మీడియా వ్యక్తులకు సైతం జీవిత భీమా వర్తిస్తుందని వివరించారు.అదే విధంగా గ్రామంలో రోడ్లు,పారిశుద్ధ్య పనులు, కరెంటు, సీసీ రోడ్ల సౌకర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చొప్పదండి రవి, పంచాయతీ సెక్రటరీలు రాజశేఖర్,సురేందర్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.