నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా

28-11-2026 | 11:50am

మంచిర్యాల క్రైమ్ (విజయక్రాంతి): నేర నియంత్రణ (Crime Control), శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా మంచిర్యాల పట్టణంలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు (Surprise Checks) నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తా, బైపాస్ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం జంక్షన్, బస్టాండ్‌తో పాటు ప్రధాన కూడళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) నిర్వహించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీలను డీసీపీ ఎ. భాస్కర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తున్న యువతతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులను విచారించి, రోడ్లపైకి వచ్చిన కారణాలను తెలుసుకున్నారు.

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతరం నిఘా (Surveillance) ఉంచాలని డీసీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని సూచించారు. ప్రజల భద్రత కోసం ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్, ఎస్సైలు ఆది మధుసూదన్, ఆంజనేయులు, శివకేశవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు