జీఎం కార్యాలయంలో 'విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు'
నస్పూర్, (విజయక్రాంతి): కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం ఇంఛార్జ్ జీఎం AV రెడ్డి విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సంవత్సరం సంస్థలో "నిజాయితీతో సమృద్ధి" (Probity for Prosperity) అనే నినాదంతో (థీమ్) ఈ కార్యక్రమాలను తలపెట్టారు. ముందుగా అధికారులు, ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా సత్య నిష్ఠా ప్రతిజ్ఞ (Integrity Pledge) చేశారు. అవినీతి నిర్మూలనే ప్రధానంగా ప్రతీయేట సింగరేణిలో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ జీఎం AV రెడ్డి తెలిపారు. వ్యక్తిగత ఆరోపణలకు తావివ్వకుండా వ్యవస్థలో లోపాలు గుర్తించి వాటిని సరిదిద్దుకోవటం, ఎవరి విధులు వారు నిబద్దతతో నిజాయితీగా నిర్వహించటం ద్వారా సంస్థ అభ్యున్నతికి కృషిచేయాలని కోరారు.
సంస్థలో ఎలాంటి అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరగకుండా చూడటమే విజిలెన్స్ ప్రధాన లక్ష్యమని, పారదర్శకతను పెంచేందుకు నివారణాత్మక, భాగస్వామ్య, శిక్షాపరమైన విజిలెన్స్ విధానాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం SCCL చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి వెంకన్న జాదవ్ సందేశం పత్రిక (Pamplet) జీఎం కార్యాలయ ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం కృష్ణ ప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, సీఎంఓఏఐ ప్రతినిధి పద్మ, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎం(ఐఈడీ) రాజన్న, లా ఆఫీసర్ మల్లేష్, పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ , డీవై పీఎం రాజేష్, డీవై పీఎం కిరణ్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ , పిట్ సెక్రటరీ సందీప్, ఇతర అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.