మూగబోయిన జంగు సైరన్
- పోరాటాలకు విరామమా...?
- చతికిల పడిన కార్మిక సంఘాలు
- కష్టాల్లో కార్మికులు
- సింగరేణి అగమ్య గోచరం
- కొంప ముంచిన ఎన్నికలు
- కార్మికులకు దిక్కెవరు...?
- బెల్లంపల్లి, అక్టోబర్ 28 : దశాబ్దాలుగా సింగరేణి(Singareni) రణక్షేత్రమై, చైతన్య స్రవంతితో విరాజిల్లింది. ఇప్పుడా పరిస్థితి లేదా? అంటే పరిస్థితులు అంతకంటే రెట్టింపుగానే ఉన్నాయనీ నిపుణులు అంటున్నారు. విప్లవాత్మక పరిస్థితిల్లో మార్పు రాలేదు. మారిందల్లా కార్మిక సంఘాలు మాత్రమే.. పరిస్థితులు అలాగే నిచ్చలంగానే ఉన్నాయి. కార్మిక సంఘాల్లోనే చోదక పోరాటశక్తి క్షీణించిందన్న అభిప్రాయాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో పోరాటాలు సద్దుమణి గిపోయాయి.
- అంతేకానీ కార్మికుల సమస్యలన్నీ బల్క్ గా పరిష్కారం అయినట్టుకాదు. వాస్తవ పరిస్థితిది. సమస్యలన్ని తీరిపోయినట్టు.. కార్మిక సంఘాలు సైలెంట్‌గా ఉండి పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మిక సంఘాల మౌనంలో పోరాటాల అవసరం తీరిపోయినట్టా? లేదా లొంగుబాటు వైఖరా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే కాబోలు గుంబనగా ఉంటున్నాయనీ విశ్లేషకులు ఎద్దేవ చేస్తున్నారు.
మౌనంగా ధిక్కార స్వరం...
సింగరేణి పోరాటాల వెల్లువ ధిక్కార స్వరం మూగబోయింది. ఆవరించిన ఈ నిశ్శబ్దంపై కార్మిక లోకంలో సవాలక్ష ప్రశ్నలు ఇప్పడు హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. ఒకసారి సింగరేణి చరిత్రలోకి వెళ్తే.. దశాబ్దాలుగా సింగరేణి అనునిత్యం పోరాటాలు, సమ్మెలు, ఆందోళనలతో తన చైతన్య మంటల్ని కార్మిక పోరాటాల కాగడాను వెలిగించాయి. అవి విప్లవోద్యమానికి పురిటిగడ్డగా సింగరేణినీ చరిత్రలో స్థిరపరిచాయి. బ్రిటిష్ కాలంలోనే సింగరేణిలో విప్లవకర ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి బీజం పడింది.
అప్పటి సింగరేణి కార్మికోద్యమ నిర్మాత దేవూరి శేషగిరిరావు బ్రిటిష్ కాలంలోనే సింగరేణి ప్రధాన కేంద్రంమైన ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి తన తన పోరాట శంఖారావాన్ని పూరించాడు. భౌతికంగా ఆయన ఇప్పుడు లేకున్నా.. శేషగిరిరావు విప్లవ కార్మికోద్యమ స్పూర్తినీ భావితర విప్లవ కార్మిక సంఘాలకు అందించాడని పలువురు భావిస్తున్నారు. ఆయన పోరాటాన్నీ వారసత్వంగా నేటి సింగరేణి విప్లవ కార్మిక సంఘాలు అందిపుచ్చుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోరాట వాతావరణంలో భాగమైనట్టు కనిపిస్తున్న ఎర్ర జెండా పేరిట వెలసిన యూనియన్లు శేషగిరిరావు వారసులమని ఇప్పటికి చెప్పుకొంటున్నాయి.
వామపక్ష జాతీయ సంఘాలు, ఆయన పేరును జపిస్తునే ఉంటాయి. అంతేకాదు.., పోరాటాల్లో తామేమీ తక్కువ కాదని, కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసినట్టు, ఇప్పటికీ చేస్తున్నామని మాటల్లోనే ఘింకరిస్తున్నాయి. పోరాటాలకు సుదూరమైనా, జాతీయ కార్మిక సంఘాల లీడర్లు తమ ఘనతను చాటుకోవడంలో వారికి మించినా మరొకరూలేరన్న అభిప్రాయాలున్నాయి. 1991లో సింగరేణిలో అడుగుపెట్టిన సరళీకృత ఆర్థిక పారిశ్రామిక విధానాలు, భారీ విధ్వంసానికి తెరతీశాయి. జాతీయ సంఘాల పోరాట ఆచరణకు తొలుత ఈ సంస్కరణలు ఒక అగ్నిపరీక్షగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడి నుంచే కార్మిక సంఘాల కాంట్ డౌన్ మొదలైంది.
ఎన్నికలే కొంపముంచాయా..?
సంస్కరణలో భాగంగా కొంత ఆలస్యంగానైనా గుర్తింపు ఎన్నికల ప్రక్రియను అమల్లోకి తెచ్చారు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల మర్మాన్ని అర్ధం చేసుకోవడంలో కార్మిక సంఘాలు పూర్తిగా విఫలం అయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికలు ఏ సందర్భంలో తలపెట్టారు. వాటి ప్రయోజనాలు ఏంటి..? ఎవరి కోసం అనే విషయాన్ని కార్మిక సంఘాలు సమీక్ష చేయలేకపోయాయి. పోరాటం, హక్కుల పరిరక్షణ స్పృహను కోల్పోయాయి. ‘గుడ్డెద్దు చేనులో పడినట్టు’ అధికార వలయంలో పడిపోయి ఉద్యమాలకు స్వస్తి పలికాయన్న తీవ్ర విమర్శలకు గురయ్యాయి. పారిశ్రామిక రంగాల్లో వచ్చిన నూతన ఆర్ధిక విధానాల ధాటికి సింగరేణి కార్మిక సంఘాలు కుప్పకూలిపోయాయి.
ఈ స్థితిలో యాజమాన్యం చేతిలో, గుర్తింపు ఎన్నికలు ప్రధాన అస్త్రం అయ్యాయి. 1998లో సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. ఈ ఎన్నికలు, సింగరేణి కంపెనీ వికాసం కోసమూ కాదూ, కార్మికుల సంక్షేమం కోసం అంతకంటే కాదూ.. కేవలం సింగరేణిలో ఆర్థిక సంస్కరణల కోసం మాత్రమే. కాగా ఈ ఎన్నికలతో కార్మిక సంఘాలకు అధికార చక్ర బంధనం విధించారు. సింగరేణిలో గెలిచిన సంఘం, ప్రాతి నిధ్య సంఘం రెండూ కంపెనీ గుప్పిట్లో బంధీ అయ్యాయి. ఇలా తమ పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోతుందని, బహుశా ఆ కార్మిక సంఘాల నాయకత్వం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. అలా జరుగుతుందనే సోయీ కూడా ఆ సంఘాల్లో కానరాలేదు.
కోడ్ ఆఫ్ డిసిప్లేన్ కోరడా...
ఎన్నికల నిర్వహణకు ముందుగానే సింగరేణి, ఎన్నికల నిబంధనావళినీ (కోడ్ ఆఫ్ డిసిప్లేన్) ప్రకటించి, ఎన్నికలకు పోవడం అనవాయితీ. ఈ నిబంధనలలో కార్మిక సంఘాల మనుగడను దెబ్బతిసే అనేక అంశాలపై పొందుపర్చారు. కార్మిక సంఘాల గొంతునొక్కే ఈ అంశాలపై లీడర్లు స్పందన లేదు. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ సమూలంగా మార్చాలని కొరకపోగా రాజీ పడ్డాయి.
‘గంగిరెద్దుల్లా కంపెనీకి తాలూపాయన్న’ విమర్శలు ఉన్నాయి. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ రూల్స్ కార్మిక సంఘాల అస్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపాయి. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ రకంగా ఎన్నికల వల్ల కార్మికులు, కార్మిక సంఘాలు స్వేచ్చను కోల్పోయాయి. కార్మికులు ఏకాకులు అయ్యారు. ఉనికి కోసం అప్పుడప్పుడూ మొక్కు బడి ప్రకటనలు, సమావేశాలు, అధికారులకు వినతులతో లీడర్లు ఆత్మహత్య సదృశ్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారన్న తీవ్ర విమర్శలు వారిపై ఉన్నాయి.