కత్తెర గుర్తుతోనే బీసీలకు రాజ్యాధికారం
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 35వ రోజు దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి చేరుకుంది. అనంతరం మల్లేపల్లి చౌరస్తా వేదికగా కార్నర్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. కేసిఆర్, రేవంత్ రెడ్డి తీసిన కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెడ్లు, వెలమలు ఇద్దరూ కలిపి కేవలం 11 లక్షల మంది మాత్రమే ఉన్నారని, కేవలం 11 లక్షల జనాభా ఉన్న రెడ్డి వర్గం నుండి 43 మంది ఎమ్మెల్యేలు, వెలమ వర్గం నుండి 13 మంది ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఉన్నాన్నారు.
అలాగే దేవరకొండలో రెడ్ల ఓట్లు కేవలం 7వేలు మాత్రమే అని రెడ్లు, వెలమల ఓట్లు కలిపినా 8వేలు దాటవుని అన్నారు. అదే సమయంలో బీసీ, ఎ స్సీ, ఎస్టీ బహుజన వర్గాల ఓట్లు ఏకంగా 1,50,000 ఉన్నాయన్నారు. లక్షన్నర ఓట్లున్న బహుజనులు పిడికెడు మంది ఉన్న ఆధిపత్య వర్గాలకు ఓట్లేసి వారి కింద బానిసలుగా బతుకుతున్నారని మల్లన్న పేర్కొన్నారు. దేవరకొండలో గెలిచిన బాలు నాయక్ పేరుకే ఎస్టీ ఎమ్మెల్యే అని, నియోజకవర్గంలో ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయాలన్నా నాగార్జునసాగర్ నుంచి ‘జానారెడి’కి ఫోన్ చేయాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్టీ ఫండ్స్ పక్కదారి ఎస్టీలకు చెందిన 2,000 కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన రెడ్డి నాయకులకు వంతపాడే ఏ నాయకుడినీ బీసీలు ఆదరించవద్దన్నారు.
తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నౌకర్లు వస్తాయని ఆశపడితే, వచ్చిన తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను దొంగిలించారని, ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 33% రిజర్వేషన్ను 23%కి తగ్గించి 10% కోత విధించింది బీసీల తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఉన్న 23% రిజర్వేషన్ను 19%కి తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. తమ పార్టీలోకి ఒక్క రెడ్డిని గానీ, వెలమని గానీ రానిచ్చే ప్రసక్తి లేదని ఇది పక్కా బీసీల (బ్యాక్వర్డ్ క్లాసెస్) పార్టీ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, నాయకులు మాడ సతీష్, సైదుల్ యాదవ్, వాసుదేవ్, బీకూ నాయక్, శివ, సుశీలమ్మ, అరుణక్క, నరసయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.