నీటికి భరోసా.. ఉపాధి అవకాశాలకు ఊతం
VB-GRAM G గ్రామసభలో పనుల గుర్తింపు
కోటపల్లి, అక్టోబర్ 2: ( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని శెట్ పల్లి గ్రామ అవసరాలే ప్రాధాన్యంగా షెట్‌పల్లిలో VB-GRAM G (MG-NREGS) గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రజల సూచనల మేరకు పలు అభివృద్ధి పనులను గుర్తించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి గ్రామసభను ప్రారంభించారు.
కోటపల్లి ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, జడ్పీపీ సీఈఓ గణపతి VB-GRAMG పథకం లక్ష్యాలు, పనుల ఎంపిక, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తూ రెయిన్‌వాటర్ సోక్‌పిట్లు, బోర్‌వెల్ రీచార్జ్ పిట్లు, ఫార్మ్ పాండ్లు, చెక్‌డ్యామ్‌లు, ఫీల్డ్ కుంటలు, గ్రావెల్ రోడ్లు, కల్వర్టులు, పశువుల కొట్టాలు తదితర పనులను గుర్తించారు.
“గ్రామం నుంచి పని.. గ్రామం కోసం పని” నినాదంతో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ఉపాధి అవకాశాల పెంపుతో పాటు నీటి వనరుల పరిరక్షణ, రైతులకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.