భూ వివాదాలకు తావులేకుండా డిజిటల్ రీసర్వే
* ముద్దాపూర్లో 188 మంది రైతులకు శాశ్వత ప్రయోజనం
* ముద్దాపూర్లో భూముల డిజిటల్ రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ రమాదేవి
పాపన్నపేట,నవంబర్06: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల డిజిటల్ రీసర్వే(Digital Resurvey of Lands) పనులను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా, త్వరితగతిన ముగించాలని సర్వే, రెవెన్యూ అధికారులను(Survey and revenue officers) మెదక్ ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు. మండల పరిధిలోని ముద్దాపూర్ గ్రామంలో(Muddapur Village) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల డిజిటల్ రీసర్వే(Digital Resurvey) పనులను మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి(Medak Revenue Divisional Officer) (ఆర్డీఓ) రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించి రీసర్వే పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో భూ వివాదాలు, పొరపాట్లకు ఎలాంటి తావు లేకుండా ఉండేందుకే డిజిటల్ రీసర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముద్దాపూర్ గ్రామ పరిధిలోని మొత్తం 405 ఎకరాల సాగు భూమికి సంబంధించి, 188 మంది రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా ఈ డిజిటల్ రీసర్వే పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఇప్పటివరకు 189 ఎకరాల భూమికి సంబంధించిన రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఆమె వివరించారు. ఇప్పటికే పూర్తయిన రీసర్వే రికార్డులను, డిజిటల్ మ్యాపులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె తహసీల్దార్ సతీష్ కుమార్, ఆర్ఐ, శరత్, సర్వే సిబ్బంది ఉన్నారు.