దీపావళి ఎఫెక్ట్‌.. ఆదివారం మందు బంద్‌!

06-11-2026 | 05:31pm

దీపావళి పండుగ (Diwali Festival) నేపథ్యంలో నవంబర్ 8న దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై (Liquor Sales) ఆంక్షలు విధించనున్నారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఎన్‌సీఆర్‌ పరిధిలోని సాధారణ బార్లు, రెస్టారెంట్లలోనూ మద్యం సరఫరా నిలిపివేయనున్నారు. అయితే ప్రత్యేక లైసెన్సులు కలిగిన కొన్ని హోటళ్లలో గదుల్లో బస చేసే అతిథులకు రూమ్‌ సర్వీస్‌ (Room Service) ద్వారా మద్యం అందించేందుకు అనుమతి ఉండనుంది.

మరోవైపు ధన్‌తేరస్‌, గోవర్ధన్‌ పూజ, భాయ్‌దూజ్‌ పండుగ రోజుల్లో మద్యం దుకాణాలు సాధారణంగానే తెరిచి ఉండనున్నాయి. అయితే మద్యం విక్రయాలపై ఆంక్షలు రాష్ట్రాల నిబంధనలను బట్టి మారే అవకాశం ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 8న మద్యం దుకాణాలు మూసివేస్తారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపై మద్యం ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు