హైవేపై వైన్స్ దందా.. ఫుట్‌పాత్‌పైనే మద్యపానం

31-10-2026 | 05:30am

ప్రభుత్వ కార్యాలయాలను అనుకొనే మద్యం బాబుల బహిరంగ సేవనం

అధికారుల మౌనంపై అనుమానాలు ?

నర్సాపూర్, అక్టోబర్ 30: హైదరాబాద్‌ మెదక్ 765డీ జాతీయ రహదారిపై నర్సాపూర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఓ వైన్స్కు ఎక్సైజ్ శాఖ నిబంధనలు వర్తించవా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అటు వాహనదారులకు ఇటు పాదాచారులకు మందుబాబులతో నిత్యం భయానక వాతావరణం నెలకుంటోంది.

పాదచారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు, గ్రిల్స్ మందుబాబుల మరో కొత్త సిట్టింగ్ అడ్డాగా, మద్యం దుకాణాలుగా అవతారమెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తూ పరోక్షంగా అధికారులు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారన్నారు. ప్రధాన రహదారిపై వేగంగా వెళ్లే వాహనాల మధ్య మహిళలు, వృద్ధులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి నెలకొన్నా సంబంధిత ఎక్సైజ్, పోలీసు అధికారులు మాత్రం కనీసం కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫుట్‌పాత్ పైనే మద్యపానం.. 

రహదారి ప్రమాదాలను నివారించేందుకు, పాదచారులు సురక్షితంగా నడిచేం దుకు జాతీయ రహదారి పక్కన పసుపు రంగు ఇనుప గ్రిల్స్, ఫుట్పాత్లను నిర్మించారు. అయితే ఈ భద్రతా వ్యవస్థలన్నీ ఆ వైన్స్ వ్యాపార దందాతో పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. వైన్స్కు వచ్చే కస్టమర్లు తమ ద్విచక్ర వాహనాలను, ఇతర వాహనాలను రహదారిపైనే అడ్డదిడ్డంగా గుంపులుగా నిలిపివేస్తున్నారు.

వైన్స్ నిర్వాహకుల నిర్వా కంతో ఫుట్పాత్ కబ్జా చేసినట్లుగా మారింది.  ఫుట్ పాత్ పైన ఉన్న ఇనుప గ్రిల్స్ లోపల ప్రాంతంలో మందుబాబులు బారులు తీరి కూర్చొని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. వైన్స్ పరిసరాలు, ఫుట్ పాత్ పైన మద్యం సీసాలు, గ్లాసులతో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయని వాపోతున్నారు. అనధికారికమైన  వ్యర్ధాలతో అటు పాదాచార్లకు ఇటు పుర పారిశుద్ధ్య కార్మికులకు తలనొప్పిగా మారాయి.

అధికారిక కార్యాలయాల కూడలిలోనే ఈ దుస్థితి...

మద్యం అమ్మకాలు, సిట్టింగులకు కూతవేటు దూరంలోనే ఎక్సైజ్ అధికారులు ఉన్నా కూడా చేతులు దులిపేసుకుంటున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. వైన్స్ కు కూతవేటు దూరంలో ఎంపీడీవో, ఆర్డిఓ ఎమ్మార్వో కార్యాలయాలు ఉన్నా వైన్స్ నిర్వాహకులను ఎవరేం చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైన్ షాప్ పై అధికారుల మొద్దునిద్రపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తక్షణమే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సంయుక్త తనిఖీలు నిర్వహించి, ఆయా వైన్స్ ల వద్ద ఫుట్పాత్ను పునరుద్ధరించి, బహిరంగ మద్యం సేవించడాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు స్పందిస్తారా లేదా వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు