బైక్ చోరీలకు పాల్పడుతున్న... ఇద్దరు నిందితులు అరెస్ట్
11 బైకులు స్వాధీనం
మేడిపల్లి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 11 బైకులను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్ కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. మేడిపల్లి సీఐ డి. జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరుస చోరీలకు పాలు పడుతున్న నిందితులు పార్కింగ్ ప్రదేశాలు,ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన బైకులను నకిలీ తాళాల సహాయంతో తెరిచి చోరీలకు పాల్పడుతున్నారు.
ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టి బోడుప్పల్ కమాన్ వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అరవింద్ కుమార్ ఉపాధ్యాయ్, అలియాస్ రాజు (56), యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామానికి చెందిన తుంగ మధు (29)లు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
అరవింద్ బోడుప్పల్ లో నివాసం ఉంటూ వెయిటరిగా పనిచేస్తుండగా, మధు చెంగిచెర్లలో నివసిస్తూ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అరవింద్ బైక్ లను చోరీ చేసి మధుకు అప్పగించే వాడని, మధు వాటిని తనకు తెలిసిన వ్యక్తులకు విక్రయించేవాడని సిఐ వెల్లడించారు.
ఈ ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించామని. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిఐ జలంధర్ రెడ్డి తెలిపారు. వాహనదారులు తమ బైకులను సురక్షిత ప్రాంతాల లో పార్కింగ్ చేయాలని, యాంటీ తెఫ్టు, పటిష్టమైన తాళాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.