వరికి బదులు ఆరుతడి పంటల సాగు

23-10-2026 | 07:29pm

భూగర్భ జలాలు తగ్గుముఖం

- ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. 

- పలివెలలో రైతులకు అవగాహన

మునుగోడు,అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో(impact of El Nino) వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు(Groundwater) తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రైతులు యాసంగిలో(Farmers – Rabi Season) వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ అన్నారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

పలివెల గ్రామంలో శుక్రవారం సాగు భూమి సంరక్షణ అభియాన్, పంట మార్పిడి విధానంపై(Crop rotation system) రైతులకు అవగాహన కార్యక్రమం  వ్యవసాయ విస్తరణ అధికారి కె. నిఖిల్ కుమార్ కలిసి మాట్లాడారు. వానాకాలంలో వరి సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకతను వివరించారు. నీటి వసతిని బట్టి శనగలు, మినుములు, పెసర్లు, జొన్నలు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.

ప్రస్తుతం బోర్లలో నీరు అందుబాటులో ఉందని వరి సాగు చేపడితే, పంట మధ్యలో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే జరిగితే పంటకు నీరు అందక పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉందని వివరించారు. భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు తలెత్తకుండా నీటి వినియోగంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా భూమిలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు.

రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి జీవ ఎరువులు, సహజ వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీనివల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా పంటల సాగుకు దోహదపడుతుందని వివరించారు.రైతులు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని, భూగర్భ జలాలను సంరక్షించుకుంటూ స్థిరమైన వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని  కోరారు.

మరిన్ని వార్తలు