ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేనా..!
- పట్టా భూములకు 1,750 గజాల స్థలం ఇవ్వాలని రైతుల డిమాండ్
- 1,400 గజాలకే పరిమితం చేయడంపై అభ్యంతరం
- ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములకూ సమాన పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి
- ఏడాదిలోగా ప్లాట్లు కేటాయించాలి.. జాప్యమైతే అదనపు పరిహారం చెల్లించాలి
అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 30: మూసీ(Musi) సుందరీకరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై రైతులు(Formers) తమ డిమాండ్లను అధికారుల ముందుంచుతున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్, నాగోల్ డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, మర్రిపల్లి తదితర గ్రామాల రైతుల నుంచి రెవెన్యూ అధికారులు గ్రామసభల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా పలు గౌరెల్లి గ్రామంలో గ్రామ నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
భూములు అప్పగించే పట్టాదారులకు హెచ్‌ఎండీఏ ద్వారా ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం 1,400 గజాల స్థలాన్ని నిర్ణయించగా, తమకు 1,750 గజాలు కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపాదిత కేటాయింపుతో తమకు నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ భూములకు 300 గజాల స్థలం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపినట్లు తెలిసింది. భూసేకరణలో న్యాయమైన పరిహారం అందించాలని రైతులకు కోరుతున్నారు.
ఎఫ్టీఎల్ భూములకూ సమాన న్యాయం
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని భూములకు కూడా పట్టా భూములతో సమానంగా 1,750 గజాల స్థలం కేటాయించాలని రైతులు అధికారులను కోరుతున్నాట్లు తెలిసింది. భూముల వర్గీకరణ ఆధారంగా పరిహారంలో వ్యత్యాసాలు ఉండకూడదని అధికారులకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు 300 గజాల స్థలం కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పరిహారంపై స్పష్టత ఇవ్వాలన్నారు.
ఏడాదిలోగా ప్లాట్లు కేటాయించాలి
భూములు అప్పగించిన తర్వాత ప్లాట్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని రైతులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ప్లాట్లు ఇవ్వకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతుల పేర్కొన్నట్లు తెలిసింది.ప్లాట్ల కేటాయింపులో ఆలస్యమైతే అదనపు పరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని రైతులు కోరుతున్నారు.
ఏడాది దాటితే రూ.10 వేలు, రెండేళ్లు దాటితే రూ.20 వేలు అదనంగా చెల్లించాలని ప్రతిపాదిస్తున్నారు.భూములు తీసుకునే సమయంలో ఇచ్చే హామీలను అమలు చేయడంతోపాటు, పరిహారం, ప్లాట్ల కేటాయింపులపై స్పష్టమైన కాలపరిమితి ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూసీ సుందరీకరణ కోసం భూములు కోల్పోతున్న రైతుల డిమాండ్లపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఒకే పరిహారం ఇవ్వాలి
మూసీ సుందరరీకరణలో భాగంగా భూములను కోల్పోతున్న రైతుల ఒకే రకమైన పరిహారం ఇవ్వాలి. పట్టా భూములకు ఇచ్చే విధంగా ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములకు కూడా పట్టా భూమి ఇచ్చే విధంగా పరిహారమివ్వవాలి.
మద్దగోని వీరస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కుత్బుల్లాపూర్ గ్రామం