ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై వార్నింగ్ లేబుల్స్ మస్ట్

27-11-2026 | 05:00am
  1. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  2. చక్కెర, ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటే ఎరుపు రంగు హెచ్చరికలు 
  3. అది కూడా ముందు భాగంలో షడ్భుజి ఆకారంలో ప్రింట్ చేయాలి
  4. ‘హై షుగర్’, ‘హై సాల్ట్’, ‘హై ఫ్యాట్’ పదాలు వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ముద్రించాలి
  5. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు పిల్లలు అధికంగా ఆకర్షితులవుతున్నారు 
  6. వారిని ఊబకాయం, మధుమేహం నుంచి కాపాడుకోవాలి
  7. 2022 నుంచే నిబంధనలు ఉన్నా అమలు చేయకపోవడం ఏమిటి?
  8. ప్రజారోగ్యం అంటే అంత చులకనా?
  9. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐపై ధర్మాసనం ఆగ్రహం

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్యాక్ చేసి అమ్మే ఆహారపదార్థాలపై తప్పనిసరిగా వార్నింగ్ లేబుల్స్(Warning Labels) ఉండాలని.. చక్కెర, ఉప్పు, కొవ్వులో ఏ ఒక్కటి నిర్దిష్ట పరిమితికి మించి ఉన్నా ఎరుపురంగులో హెచ్చరికలను ముద్రించాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుడికి సులువుగా అర్థమయ్యేలా ఆ హెచ్చరికలను షడ్భుజి ఆకారంలో ప్యాకెట్ ముందు భాగంలోనే ఎడమవైపు ముద్రించాలని స్పష్టం చేసింది. ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.

నిబంధనలు 2022 నుంచే ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలయ్యేలా చూడాల్సిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఏం చేస్తున్నదని న్యాయస్థానం నిలదీసింది. ప్రజారోగ్యం అంటే అంత చులకనా? అని మండిపడింది.  ప్రజారోగ్యం కంటే ఆహార పరిశ్రమల వ్యాపారం ముఖ్యం కాదని తేల్చిచెప్పింది. దేశంలో మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై తప్పనిసరిగా హెచ్చరికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐపై ఉందని గుర్తుచేసింది. 

ఒక్కో దానికి విడివిడిగా..!

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉన్నా, కొవ్వు మోతాదు అధికంగా ఉన్నా, ఉప్పు మోతాదు ఎక్కువగా ఉన్నా విడివిడిగా వాటి గురించి వినియోగదారుడికి అర్థమయ్యేలా హెచ్చరికలను ముద్రించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘హై షుగర్’, ‘హై ఫ్యాట్’, ‘హై సాల్ట్’ అనే పదాలు కూడా స్పష్టంగా ప్రింట్ చేయాలని ఆదేశించింది. ఆ పదాలకు బ్యాక్ గ్రౌండ్ తెలుపు రంగు ఉండాలని స్పష్టం చేసింది.

సాధారణంగా ప్యాకేజ్డ్ ఫుడ్‌లోని పోషక విలువలు, ఇతర అంశాలను వివరిస్తూ ప్యాకెట్ వెనుక భాగంలో ప్రత్యేక టేబుల్‌లో కంపెనీలు ముద్రిస్తుంటాయి. ఈ టేబుల్‌ను సాధారణంగా వినియోగదారులు గమనించరు. చక్కెర, ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటే.. వాటికి సంబంధించిన హెచ్చరికలు, పదాలను ప్యాకెట్ వెనుక భాగంలోని టేబుల్‌లో ఉండే పదాల కంటే పెద్దగా ముందు భాగంలో ఎడమవైపు ముద్రించాలని సుప్రీం పేర్కొంది. 

పోషకాల గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవుతున్నందున పౌషక పదార్థాలపై వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోషకాల గురించి పాఠ్య పుస్తకాల్లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించాలని.. ఇదే అంశంపై ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, కో కరిక్యులమ్ యాక్టివిటీస్ నిర్వహించేలా చూడాలని స్పష్టం చేసింది. పిల్లలు ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ధర్మాసనం పేర్కొంది. 

పిల్లలు ఎక్కువగా తింటున్నారు

ప్యాకేజ్డ్ ఫుడ్స్ అడ్వర్టయిజ్‌మెంట్స్‌కు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, వాటిని తినేందుకు ఇష్టపడుతున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్ చిప్స్, స్నాక్స్‌తోపాటు కూల్ డ్రింక్స్‌లో అధిక మోతాదులో షుగర్, సాల్ట్, ఫ్యాట్  ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని తెలిపింది. స్పష్టమైన నిబంధనలు 2022 నుంచే ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం ఏమిటని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని నిలదీసింది. జీవించే హక్కు, ఆరోగ్య హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్నదని.. ప్యాకేజ్డ్ ఫుడ్స్ విషయంలోనూ దీన్ని అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. నిబంధనలను స్వచ్చంధంగా అమలు చేసేందుకు కంపెనీలకు 365 రో జులపాటు గడువు ఇవ్వాలన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు