ఏజెన్సీ ప్రజల గోడు!

05-10-2026 | 05:28pm

గోతుల రోడ్లు.. కరెంట్ కష్టాలు.. 

వెంకటాపురం–వాజేడు పరిస్థితులపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ

వెంకటాపురం: ఒకవైపు ఇసుక, ఖనిజ సంపద తరలింపు.. మరోవైపు అధ్వాన రహదారులు, విద్యుత్ సమస్యలు.. ఇంకోవైపు విద్య, వైద్య రంగాల్లో కొరత.. ఇదీ ములుగు జిల్లా(Mulugu District) ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం బీఆర్‌ఎస్(BRS) పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ నాయకులు గొడవర్తి నరసింహమూర్తి మాట్లాడుతూ.. వెంకటాపురం, వాజేడు మండలాల అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు దయనీయంగా ఉన్నాయని అన్నారు.

రోడ్లపై ప్రశ్నల వర్షం..

వెంకటాపురం, వాజేడు వైపు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, పలుచోట్ల వంతెనలు కూడా ప్రమాదకరంగా మారుతున్నా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులు(CC road works) సైతం నిధుల సమస్యతో ముందుకు సాగడం లేదన్నారు.

రైతులకు ఎరువుల కష్టాలు..

వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందడం లేదని, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాప్ ఆధారిత ఎరువుల పంపిణీ విధానం రైతులకు మరింత భారంగా మారిందని అన్నారు.

800 ఎకరాల భూమిపై స్పష్టత ఇవ్వాలి

ఏజెన్సీ ప్రాంతాల్లో పేద గిరిజన, గిరిజనేతరుల భూములను 22ఏ జాబితాలో చేర్చిన వ్యవహారంపై అధికారులు సమగ్రంగా వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు  డిమాండ్ చేశారు. సుమారు 800 ఎకరాల భూమికి సంబంధించిన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ ఉద్యమ నాయకుడు చిడెం రవి  కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో పట్టభద్రుల ఓటు కీలకమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు