సూరవీడు గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కాంగ్రెస్ కైవసం
సూరవీడు పంచాయతీపై కాంగ్రెస్ పట్టు తాత్కాలిక సర్పంచ్గా కొర్సా ప్రసాద్
ఉప సర్పంచ్ గోగు నరసింహారావు
వెంకటాపురం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం మండలం సూరవీడు గ్రామపంచాయతీలో తాత్కాలిక సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం వార్డు సభ్యులతో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ వార్డు సభ్యులు బలపరిచిన కొర్సా ప్రసాద్ సర్పంచ్గా, గోగు నరసింహారావు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ బలపరిచిన కొర్సా మురళి సర్పంచ్, ఉప సర్పంచ్గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.
అయితే పంచాయతీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్లను ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్(Mandal Parishad Development Officer Praveen Kumar) ఆధ్వర్యంలో సూరవీడు పంచాయతీ కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య తాత్కాలిక సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు.
పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ కలిపి పది మంది సభ్యులు ఉండగా, ఎన్నికలకు ఎనిమిది మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి, ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొర్సా ప్రసాద్ సర్పంచ్, గోగు నరసింహారావు ఉప సర్పంచ్గా ఎన్నికైనట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.. సర్పంచ్, ఉప సర్పంచ్లుగా ఎన్నికైన వారు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గతంలో బాధ్యతలు చేపట్టి సస్పెన్షన్కు గురికావడంతో కాంగ్రెస్, బీఆర్ఎ ఎస్ నాయకులు ఈఎన్నికలనుప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
వెంకటాపురం ఎస్ఐ కే. తిరుపతిరావు, శిక్షణ ఎస్ఐ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో పంచాయతీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టెం సాయి, మండల ఎస్సీ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు సాగర్, కాంగ్రెస్ నాయకులు డర్ర రవి, సూరవీడు పంచాయతీ కాంగ్రెస్ నాయకులు నూతనంగా ఎన్నికైన తాత్కాలిక సర్పంచ్, ఉప సర్పంచ్లను పట్టు శాలువాలతో సత్కరించి అభినందించారు.