వారసత్వ కట్టడాల నిర్మాణంలో సామగ్రి ఎంపిక కీలకం
ఐదవ రోజు కొనసాగిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ శిక్షణ
వెంకటాపూర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మండలంలోని రామప్ప దేవాలయం(Ramappa Temple) వద్ద నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ శిక్షణ శిబిరం(World Heritage Volunteer Training Camp) మంగళవారం ఐదవ రోజుకి కొనసాగింది. ఈ సందర్భంగా ఉదయం యోగా గురువు యోగి రాంబాబు ఆధ్వర్యంలో వాలంటీర్లకు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చారు.
అనంతరం నిట్ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ దేవ ప్రతాప్ ‘వారసత్వ కట్టడాల నిర్మాణంలో నిర్మాణ సామగ్రి ఎంపిక’ అనే అంశంపై వాలంటీర్లకు అవగాహన కల్పించారు. పురాతన కట్టడాల నిర్మాణంలో ఆయా కాలాలకు అనుగుణంగా సంప్రదాయ ఇటుకలు, రాయి, సున్నం వంటి నిర్మాణ సామగ్రిని ఎంపిక చేసిన విధానాలను వివరించారు.
వారసత్వ కట్టడాల ప్రత్యేకతను కాపాడటంలో సంప్రదాయ నిర్మాణ సామగ్రి ప్రాధాన్యాన్ని తెలియజేశారు. అనంతరం ప్రొఫెసర్ పాండురంగారావు ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రూప్ డిస్కషన్ నిర్వహించి, నేర్చుకున్న అంశాలపై పీపీటీ ప్రజెంటేషన్లు, వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీధర్‌రావు, శ్రీనివాస్, పర్యాటక శాఖ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లు, టూరిస్ట్ పోలీసులు పాల్గొన్నారు.