గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల్లో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
వరంగల్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఎలక్షన్ల ముందు బీసీల జపం చేసి, అధికారంలోకి వస్తే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని నమ్మబలికి, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను నమ్మించి, బీసీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చాక బీసీల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వ్యతిరేక వైఖరిని మార్చుకొని.. వచ్చే నెలలో గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల్లో రెండు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులను బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్(Vadlakonda Venugopal Goud) డిమాండ్ చేశారు.
జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ పదవులు, నిర్ణయాధికారంలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అగ్రవర్ణ పార్టీలు బీసీలను ఓటర్లుగానే పరిగణిస్తున్నారని, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులోనూ ఆర్థిక స్తోమత లేదనే కారణాలతో ఎమ్మెల్యే టికెట్లను నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా, సామాజిక న్యాయం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఇద్దరు రెడ్లకు టికెట్లను కేటాయించి బీసీలను తీవ్రంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ పదవుల్లో అర్హత, సామాజిక సేవ, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన బీసీ నాయకులకు అవకాశం కల్పించాలని వేణుగోపాల్ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు.