చెత్త సమస్యకు చెక్ పెట్టండి: ఈటల

27-10-2026 | 06:15pm

ఎదులాబాద్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు(Jawahar Nagar dumping yard) సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి విజ్ఞప్తి చేశారు. ఆధునిక వ్యర్థాల నిర్వహణ సాంకేతికతను వినియోగించి సుమారు రూ.2,000 నుంచి రూ.3,000 కోట్లతో ఈ సమస్యను పరిష్కరించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని కోరారు. ఎదులాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యపై స్థానికులు, జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) గత 12 ఏళ్లుగా పోరాడుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. డంపింగ్ యార్డు నిర్వహణలో నిబంధనలు పాటించాలంటూ గతంలో న్యాయస్థానాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని గుర్తుచేశారు.

గతంలో ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి కూడా ఈ సమస్యపై ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసులు వేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందున సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించానని, అయితే రెండేళ్లు గడిచినా ఆశించిన స్పందన కనిపించడం లేదని విమర్శించారు.

జవహర్‌నగర్, బాలాజీనగర్ ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఈటల సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే సమస్యను పరిష్కరించడం సాధ్యమని అభిప్రాయపడ్డారు.

డంపింగ్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలను ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసి, పునర్వినియోగానికి అనుకూలంగా మార్చవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వినియోగించడం, తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయడం, పొడి వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి పద్ధతులను అమలు చేయాలని సూచించారు.

డంపింగ్ యార్డు ప్రభావంతో పరిసర ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని, పశుసంపద, వ్యవసాయం కూడా దెబ్బతింటున్నాయని ఆరోపించారు.

ఎదులాబాద్ పరిసరాల్లో క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సమస్యలకు డంపింగ్ యార్డు కాలుష్యమే కారణమనే అంశంపై సంబంధిత శాఖలు శాస్త్రీయంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. చివరి రోజు బాలాజీనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారమయ్యే వరకు బాధిత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో స్థానికులు, బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు