వార్తలు రాసిన విలేకరిపై బూతు పురాణం

04-10-2026 | 03:57pm

సోషల్ మీడియా వేదికగా తిట్ల దండకం

విద్యుత్ అధికారులు లైన్ మెన్ పై చర్యలు తీసుకొనేనా

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలు

కన్నాయిగూడెం, అక్టోబర్ 04 (విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికగా ఆదివారం ముప్పనపల్లి లైన్ మెన్ పల్లె బోయిన రవి వార్త రాసిన విజయక్రాంతి దినపత్రిక కన్నాయిగూడెం విలేకరి(Journalist) నాగరాజుపై పేపర్లలో రాయలేని విధంగా తిట్ల దండకం అందుకున్నాడు. గత నెల సెప్టెంబర్ 22, 23 తేదీల్లో కన్నాయిగూడెం మండలంలో అనధికారిక విద్యుత్ కోతలు.. అనే కథనాన్ని పలువురు రైతుల వాయిస్ తో కూడిన కథనం ప్రచురించడం జరిగింది.

దీంతో స్పందించిన జిల్లా, డివిజన్ విద్యుత్ అధికారులు కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు, కన్నాయిగూడెం సబ్ స్టేషన్లను తనిఖీ చేసి, నేరుగా రైతులతో మాట్లాడి విద్యుత్ సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేసారు. రిపేర్ అయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడ పడితే ఎక్కడ ఉంచడం, ఇష్టం వచ్చినట్టు కరెంటు కట్ చేయడం మరియు మండలంలో అసంపూర్తిగా చేసిన పనులపై జిల్లా విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

విజయక్రాంతి దినపత్రికలో కథనం రావడంతో జిల్లా, డివిజనల్ విద్యుత్ అధికారులు విచ్చలవిడిగా లైన్ కట్(ఎల్సీ) ఇవ్వడంతో ముప్పనపల్లి లైన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయక్రాంతి దినపత్రిక రిపోర్టర్ టార్గెట్ గా సోషల్ మీడియా వేదికగా లైన్ మెన్  పల్లెబోయిన రవి ఆదివారం రోజున తిట్ల దండకం అందుకున్నాడు .వార్త రాసి 10-12 రోజుల అవుతుంది.. అయినా ఆ విషయం ఇప్పుడు ఎందుకు అని జర్నలిస్ట్ ప్రశ్న వేయగా నువ్వు వార్త రాయడం వలనే నాకు ఇబ్బంది అయ్యింది.. నువ్వు ఎవడివి, నన్ను అడగకుండా వార్త ఎలా రాస్తావా అని నానా బూతులు మాట్లాడినాడు. పేపర్లో కథనం రాయడం వలనే అధికారులు తనపై ఆగ్రహం చేసారని మనసులో ఉంచుకుని ఇలా చేసారని పలువురు జర్నలిస్ట్ లు ఆగ్రహం వ్యక్తం చేసారు...

సంవత్సరాల నుండి పాతుకు పోయిన ముప్పనపల్లి లైన్ మెన్ రవి

గత 10-15 సంవత్సరాలనుండి కన్నాయిగూడెం మండలం(Kannaigudem Mandal)లోనే తిష్ట వేసిన లైన్ మెన్, జిల్లా డివిజన్ స్థాయి అధికారులను మచ్చిక చేసుకుని స్థాన చలనం లేకుండా ఉన్నాడు.దీంతో ముప్పనపల్లి లైన్ మెన్ మండలంలో ఇష్టం వచ్చినట్టు డ్యూటీలు చేస్తూ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో సంబంధిత అధికారులు ములుగు జిల్లా కేంద్రానికి బదిలీ చేసారు.

జిల్లా కేంద్రంలో తరచూ విధులకు డుమ్మా కొట్టడంతో జిల్లా అధికారులు సైతం ఏం చేయలేక కన్నాయిగూడెం మండలానికి మళ్ళీ బదిలీ చేసి అధికారులు సైతం చేతులు దులుపుకున్నట్టు సమాచారం.స్థానిక రైతుల అవసరాలను అసరాగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తూ పనులు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.ఏ పని చేయాలన్నా మామూళ్లుగానే నడుస్తున్నట్టు సమాచారం.

విధులకు డుమ్మా, కింది స్థాయి సిబ్బందిపై అధిక భారం

స్థానికంగా విధులు నిర్వర్తిస్తూ, స్థానికంగా నివాసం ఉండాల్సిన లైన్ మెన్ స్థానికంగా ఉండకుండా సుధూర ప్రాంతాల్లో ఉంటూ విధులకు డుమ్మా కొడుతూ, కింది స్థాయి అవుట్ సోర్సింగ్  సిబ్బందితో వెట్టి చాకిరీ చేపించడంతో కింది స్థాయి సిబ్బంది సైతం పై అధికారులకు పిర్యాదు చేస్తున్నా కూడా జిల్లా, మండలం స్థాయి విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేరనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికి అయినా సంబంధిత అధికారులు జిల్లా స్థాయి విద్యుత్ అధికారులు స్పందించి లైన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు...

ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా జర్నలిస్ట్ సంఘాలు*

ప్రజా సమస్యలే ఎజెండాగా, స్వార్థం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జర్నలిస్ట్ లను తిట్టడం, కొట్టడం నేరం కిందకి వస్తుందని పలువురు జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు.కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడటం నిజం కదా, నిజాలను  నిర్భయంగా రాయడం తప్పా అని పలువురు వర్కింగ్ జర్నలిస్ట్ లు ఆగ్రహం వ్యక్తం చేసారు. వార్త రాసిన విలేకరిపై దుర్భాషలాడిన లైన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోని యెడల మండల, జిల్లా స్థాయి జర్నలిస్ట్  సంఘాలతో కలిసి విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు