దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం
వెంకటాపూర్,(విజయక్రాంతి): దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) చేసిన సేవలు చిరస్మరణీయమని మండల స్పెషల్ ఆఫీసర్ కొమురయ్య(Special Officer Komuraiah) అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కొమురయ్య, తహసీల్దార్ గిరిబాబు, ఇన్చార్జ్ ఎంపీడీవో షాజియాతో కలిసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు.
ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి ఆదర్శమని, పటేల్ ఆశయాలు, స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భారతీయులమనే భావనతో ఐకమత్యంగా ఉండాలని, జాతీయ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఇన్చార్జ్ ఎంపీడీవో షాజియా, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.