కాకతీయుల శిల్పకళ అద్భుతం..
వెంకటాపూర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని(Ramappa Temple) మంగళవారం జర్మనీ దేశానికి చెందిన పాబియన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, కాకతీయుల చారిత్రక విశేషాలను వివరించారు.
ఈ సందర్భంగా పాబియన్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, చరిత్రపై తనకు ఎంతో ఆసక్తి ఉందని, కాకతీయుల అద్భుత నిర్మాణాలకు ప్రతీకలైన రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడిలోని శిల్పకళ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు.
స్థానిక వంటకాలు, ప్రజల ఆతిథ్యం ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించిన ఆయన పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లలో బోటింగ్ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్, టూరిస్ట్ పోలీసులు బద్రు, అరుణ్, శ్రీకాంత్, శ్రీనివాస్ తో పాటు పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.