ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన తహసీల్దార్ సృజన్ కుమార్...
ఏసిబి కోర్టు తరలింపు
ములుగు, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని(Agricultural land) కుమార్తె పేరు మీద మార్చేందుకు 14000 లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి గోవిందరావుపేట (Govindaraopet) తాసిల్దార్ నెల్లుట్ల సృజన్ కుమార్ (Nellutla Srujan Kumar)అడ్డంగా దొరికిపోయారు.
ఏసీబీ డిఎస్పి సాంబయ్య కథనం ప్రకారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన ఒక మహిళ ఏప్రిల్ నెలలో మృతిచెందగా ఆమె కుమార్తె మే నెలలో మీసేవ ద్వారా వ్యవసాయ భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నాలుగు నెలలుగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదు.
ఈ క్రమంలో తాసిల్దార్ ను కలవడంతో ఎమ్మార్వో సృజన్ కుమార్ 15 వేల రూపాయలు లంచం ఇస్తేనే భూమి మార్పిడి చేస్తానని స్పష్టం చేశారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీ ని ఆశ్రయించగా శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో 14 వేల రూపాయలు డబ్బులు ఇస్తున్న క్రమంలోనే వల పన్ని పట్టుకున్నారు. కాగా 2024 జనవరి 10న సృజన్ కుమార్ ఇక్కడ తాసిల్దార్ గా విధి నిర్వహణ చేస్తున్నారు.
మొట్టమొదటిసారిగా మండలంలో ఏసీబీ దాడులు జరగడం.. తహసిల్దార్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పనుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి సాంబయ్య సూచించారు.