నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

24-09-2026 | 02:28pm
  1. అడవిలోనూ అద్భుత ప్రతిభ
  2. ఉత్తమ గురువులు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చగలరు.
  3. నూతన పాఠశాలలను ప్రారంభించిన సీతక్క

ములుగు, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మారుమూల గిరిజన గూడాల్లోని చిన్నారులకు విద్యను చేరువ చేసి,  నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌(State Panchayat Raj), గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister for Child Welfare Seethakka) అన్నారు. గురువారం ఏటూరునాగారం మండలం మామిడిగూడెం గ్రామంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ సమకూర్చిన 15 లక్షల సి.ఎస్.ఆర్‌. నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను, కొమరం భీమ్‌నగర్‌ కాలనీలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షల సి.ఎస్.ఆర్‌. నిధులతో ఏర్పాటు చేసిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా ప్రతి చిన్నారికి చదువుకునే అవకాశం ఉండాలన్నారు. పాఠశాలలు, రహదారులు, విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల అటవీ ప్రాంతాల్లోనూ విద్యకు ఆటంకం కలగకుండా అవసరమైన చోట కంటైనర్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుత్తికోయ ఆదివాసీ గూడెమైన మామిడిగూడెంలో పరిమిత సౌకర్యాల మధ్య విద్యార్థులు ప్రదర్శిస్తున్న ప్రతిభ ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పాటలు, కథలు, సంభాషణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారని ప్రశంసించారు.

పట్టణ ప్రాంతాల విద్యార్థులకు దీటుగా గిరిజన చిన్నారులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ఇర్ప మధు, సారంగం సేవలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కోసం సమయాన్ని కేటాయిస్తూ సరైన మార్గదర్శనం అందించే గురువులు వారి జీవితాల్లో శాశ్వత ముద్ర వేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో విద్యావ్యవస్థ బలోపేతానికి పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, విద్యాశాఖ అధికారుల కృషిని మంత్రి అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపించి, వారి చదువుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

మామిడిగూడెంలో త్వరలో బోరు మంజూరు చేసి తాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు సౌర విద్యుత్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మంజూరైన రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు పొందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ సహకారంతో అంబులెన్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా మార్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులతో మంత్రి ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్‌తో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీ మనన్‌ భట్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రఘు, ఉల్లాస్‌ సమన్వయకర్త కృష్ణబాబు, తహసీల్దార్‌, మండల విద్యాధికారి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు